P.Chidambaram: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సమీప బంధువు దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణం?
- మహిళతో వివాహేతర సంబంధం
- హెచ్చరించినా పట్టించుకోని శివమూర్తి
- కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులు
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సమీప బంధువు శివమూర్తి (47) దారుణ హత్యకు గురయ్యారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ప్రధాన సూత్రధారి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..
తమిళనాడులోని తిరప్పూరు శివారు ఊత్తుకుళి రోడ్డులోని కురుమారం పాళయకోటకు చెందిన శివమూర్తి బనియన్ల పరిశ్రమ నిర్వహించేవారు. ఆ సమయంలో అందులో పనిచేసే ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన మహిళ భర్త మూర్తి పలుమార్లు శివమూర్తిని హెచ్చరించాడు. అయినా, పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 25న శివమూర్తి కిడ్నాప్‌కు ప్లాన్ వేశాడు.
అదే రోజు శివమూర్తి కోయంబత్తూరు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అయితే, రెండు రోజులైనా అతడి నుంచి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమూర్తి కారులోని జీపీఎస్ పరికరం ద్వారా విచారణ ప్రారంభించిన పోలీసులు ఆయన కారు వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వెంగుళి గ్రామం మీదుగా వెళ్తున్నట్టు గుర్తించారు.
వెంటనే వేలూరు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. కారును గుర్తించి అందులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. శివమూర్తిని కిడ్నాప్ చేసి మేట్టుపాళయం సమీపంలోని వెళ్లియంకాట్టులో హత్య చేసినట్లు తెలిపారు.
మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలియక రెండు రోజులపాటు కారులోనే తిప్పినట్టు చెప్పారు. చివరికి మృతదేహం పైకి తేలకుండా ఉండేందుకు బండరాయి కట్టి, హోసూరు శివారులోని కెలవరపల్లి జలాశయంలో పడేసినట్లు వివరించారు. బుధవారం మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మూర్తిని అదుపులోకి తీసుకున్నారు.