kcr: విజయవాడ చేరుకున్న కేసీఆర్.. భారీ కాన్వాయ్ తో దుర్గ గుడికి పయనం
- గన్నవరం విమానాశ్రయంలో కేసీఆర్ కు స్వాగతం పలికిన మంత్రి దేవినేని
- కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్న కేసీఆర్
- కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వాయ్ మధ్య ఆయన దుర్గ గుడికి బయల్దేరారు. ఆయన వెంట మంత్రి దేవినేని, టీఎస్ హోంమంత్రి నాయిని, ఎంపీ కేకేలు ఉన్నారు.
ఆలయానికి చేరుకున్న తర్వాత కనకదుర్గమ్మకు కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కేసీఆర్ రాక కోసం ఆలయం వద్ద అర్చకులు, అధికారులు వేచి చూస్తున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు, కేసీఆర్ పర్యటన సందర్భంగా విజయవాడలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయం వద్ద ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు వేచి ఉన్నారు. మరోవైపు, కేసీఆర్ రాక సందర్భంగా రోడ్లపై భారీ ఎత్తున బ్యానర్లు వెలిశాయి. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.