rupee: రూపాయి విలువ పతనంతో మనకు ఏ విధంగా నష్టం?
- పెట్రోల్, డీజిల్ దిగుమతులపై అధిక వ్యయాలు
- వాటి రిటైల్ ధరలకు రెక్కలు
- దాంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం
- ఫలితంగా ఆర్ బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ ఈ రోజు 69 స్థాయికి క్షీణించడం ఆందోళన కలిగించే అంశమే. ముఖ్యంగా చమురు అవసరాల్లో 80 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి కరెన్సీ విలువ పతనం కావడం మింగుడుపడని అంశమే. ఇలా రూపాయి పతనం అయితే, దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దేశ వాణిజ్యలోటు పెరుగుతుంది.
ముఖ్యంగా చమురు దిగుమతులపై అయ్యే అధిక వ్యయాలు వాటి రిటైల్ ధరలపై ప్రతిఫలిస్తాయి. పెట్రోల్, డీజిల్, దీని అనుబంధ ఉత్పత్తుల ధరలన్నీ పెరిగిపోతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతుంది. ఇలా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హద్దులు దాటిపోతుంటే ఆర్ బీఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా కట్టడికి ప్రయత్నిస్తుంది. దాంతో రుణాలు తీసుకున్న వారందరి ఈఎంఐ పెరిగిపోతుంది. ఇక విదేశాల్లో చదువుకునే వారు డాలర్ల రూపంలో ఫీజుల చెల్లింపునకు ఎక్కువ రూపాయిలను ఖర్చు చేయాల్సి వస్తుంది. విదేశీ ప్రయాణాలు భారమవుతాయి. కాకపోతే విదేశాల్లో ఆస్తులున్నవారికి లాభం. వాటిని అమ్ముకుంటే ఎక్కువ రూపాయిలు పొందొచ్చు.