jc divakar reddy: మభ్యపెట్టాలని, ఆలస్యం చేయాలని చూస్తున్నారు!: ఉక్కు పరిశ్రమపై భేటీ తరువాత జేసీ దివాకర్ రెడ్డి
- కేంద్ర సర్కారు 1,800 ఎకరాల భూమి మాత్రమే అడుగుతోంది
- సెయిల్ వారు 4,000 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు
- మెకాన్ వారు వచ్చి తమకు అంత భూమి అవసరం లేదన్నారు
- మళ్లీ 1,800 ఎకరాలు చాలని అన్నారు
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 3,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం జేసీ దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... "కేంద్ర సర్కారు 1,800 ఎకరాలు మాత్రమే అడుగుతోంది. తొలుత సెయిల్ వారు 4,000 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు.
మధ్యలో మెకాన్ వారు వచ్చి తమకు అంత భూమి అవసరం లేదు.. 1,800 ఎకరాలు చాలని అన్నారు. అయితే తీసుకోండని చెప్పాము. మళ్లీ ఈ 1,800 ఎకరాలు కాకుండా, దాని పక్కన ఉన్న 500 ఎకరాల భూమి కూడా ఇవ్వండని అన్నారు. అంతా దుర్బుద్ధి.. ఆలస్యం చేయాలని, మభ్య పెట్టాలని చూస్తున్నారు. వారు కోరుకున్న ఆ 500 ఎకరాలు కూడా ఇస్తామని చెప్పాం.
మేము ఎంత ఖర్చు చేసి కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎకరానికి రూ.4 లక్షలకు ఇచ్చేందుకు సిద్ధమని అన్నాం. వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో ఏదైనా ఒకరోజు మళ్లీ కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో భేటీ అవుతాం. కేంద్ర సర్కారు అడిగిన వాటికన్నింటికీ ఒప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అంశాలకు ఒప్పుకోలేదని రేపు కేంద్ర సర్కారు అనకుండా, అన్నింటికీ ఒప్పుకుని దాని నోటికి తాళం వేశాం" అని అన్నారు.