USA: సహచరులు హత్యకు గురైనా.. పత్రిక ఆగడానికి వీల్లేదంటూ... పనిలోకి దిగిన జర్నలిస్టులు!
- ఐదుగురు సహచరులను కోల్పోయి కూడా పనిలోకి
- ఎన్నాపోలిస్ లోని చిన్నపత్రిక 'కాపిటల్ గెజిట్'పై కాల్పులు
- సహచరుల ఆత్మశాంతి కోసం పేపర్ తెస్తున్నామన్న రిపోర్టర్లు
ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు సహచరులు ప్రాణాలు కోల్పోయినా, వారి నిబద్ధత, పనిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమెరికాలోని ఎన్నాపోలిస్ కేంద్రంగా నడుస్తున్న 'కాపిటల్ గెజిట్' పత్రిక కార్యాలయంపై దుండగుడు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది హృదయవిదారకమైన ఘటనని, కోల్పోయిన తమ సహచరుల ఆత్మశాంతి కోసం రేపు పేపర్ ను తెస్తున్నామని చేజ్ కుక్ అనే రిపోర్టర్ వ్యాఖ్యానించారు. తన కొలీగ్ జోషువా మెక్ కెర్రోవ్ తో కలసి పని చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
కాగా, 1727లో మొదలైన 'కాపిటల్ గెజిట్'లో తాను 2013 నుంచి పని చేస్తున్నానని చెప్పాడు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు కార్యాలయాన్ని మూసివేయగా, ఓ పికప్ వ్యాన్ వెనక ల్యాప్ టాప్ ను పెట్టుకుని పనిచేస్తున్న ఫొటోలను పంచుకున్నాడు చేజ్ కుక్. ఇంతకన్నా ప్రస్తుతానికి తాము చేయగలిగింది ఏమీ లేదని, తమ జాబ్ ను తాము చేస్తున్నామని తెలిపాడు. ఓ స్థానిక పత్రికగా సేవలందిస్తున్న 'కాపిటల్ గెజిట్'లో కేవలం 13 మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు పని చేస్తున్నారు.