nimmakur: ఎన్టీఆర్ స్వగ్రామం ‘నిమ్మకూరు’ను తీర్చిదిద్దిన నారా లోకేశ్
- ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు
- లోకేశ్ దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలు మారిన వైనం
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ గ్రామం సమస్యలతో సతమతమయ్యేది. అయితే, ఏపీ మంత్రి, ఎన్టీఆర్ మనవడు నారా లోకేశ్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రత, స్వచ్ఛతకు ఆదర్శంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దారు.
ఈ గ్రామంలో మొత్తం 260 ఇళ్లు ఉన్నాయి. పది నెలల కిందట ప్రయోగాత్మకంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో 5.7 కిలో మీటర్ల పొడవునా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఈ గ్రామంలో పూర్తి చేశారు. తద్వారా ఈ గ్రామంలో మురుగునీరు కనిపించట్లేదు. గ్రామంలో ఉదయానే పారిశుద్ధ్య సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరిస్తారు. పారిశుద్ధ్య సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ నిమిత్తం రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు కార్డులను ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేయడం జరిగింది.
త్వరలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక సేకరించిన వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. రోడ్ల విస్తరణ, పంచాయతీ పరిధిలో సమాచార కేంద్రం ఏర్పాటు, ఆసుపత్రి నిర్మించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా యూజీడీ ప్రాజెక్టును నిమ్మకూరుకు మంజూరు చేయించిన ఘనత నారా లోకేశ్ కే దక్కుతుందని, రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం సాధించిన నిమ్మకూరు ఆదర్శగ్రామంగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.