Hyderabad: హైదరాబాద్‌లో వర్షాకాలం ముగిసిన తరువాతే బీటీ రోడ్ల నిర్మాణం!

  • మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సూచనలు
  • రోడ్లు, పుట్ పాత్ ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వెంటనే 
  • వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు

జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల ద్వారా చేపడుతోన్న వివిధ అభివృద్ధి పనులు ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఈరోజు హైదరాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల వెడల్పు, పుట్ పాత్ ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. వర్షాకాలం ముగిసిన తరువాతే బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పనులు చేపట్టడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

పనులలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్దేశించిన కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత కాలపరిమితిలోగా పనులు పూర్తవుతాయని చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ వివరించారు. జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లతో సమీక్షిస్తూ పనులు చేపట్టేటప్పుడు మెట్రోవాట్ర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

మంచినీటికి సంబంధించిన పనులు పూర్తైన తరువాతే మిగతా పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి.. పనులు జరుగుతున్నప్పుడు, పూర్తయిన తరువాత ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయాలని ఆయన సూచించారు. ప్రజల నుండి సోషల్ మీడియా ద్వారా ఏమైనా ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు.
                         
మెట్రోవాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ.. 300 మి.మీ పైపులైన్ ట్రెంచెస్ కు సంబంధించి బి.టి, సి.సి రోడ్లపై 683.19 కిలో మీటర్లకు గాను 677.69 కి.మీల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని మిగతావి త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. 300 మి.మీ పైపు లైన్ ట్రెంచెస్ కంటే పెద్దవైన పైపులైన్లకు సంబంధించి 160.23 కిలో మీటర్లకు గాను 131.44 కి.మీ పూర్తి చేశామని, మిగతావి త్వరలో పూర్తవుతాయని ఆయన వివరించారు.                          

  • Loading...

More Telugu News