Motkupalli: అంత నీచపు మాటలు ఎలా వచ్చాయి?.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోత్కుపల్లి నర్సింహులు
- దళితులను అవమానించే వ్యాఖ్యలు చేశారు
- అంబేద్కర్ విధానాలను అణగదొక్కుతున్నారు
- ఓట్ల కోసమే తాజా 'దళిత తేజం'
- మీడియాతో మోత్కుపల్లి నర్సింహులు
తనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు, దళిత వర్గాలను ఉద్దేశించి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బడుగు బలహీన వర్గాల కోసమే తాను బతుకుతున్నానని చెప్పుకునే చంద్రబాబు నోట, ఆయన మనసులోని మాట వచ్చిందని అంటూ, "తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?" అని గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దళిత వర్గాల దేవుడైన అంబేద్కర్ విధానాలను అణగదొక్కుతున్న ఘనత చంద్రబాబుదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దళిత వర్గాలను కేవలం ఓట్లు వేసేందుకు మాత్రమే వాడుకుంటున్నారు తప్ప, వారి బాగోగులను చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు మాటల్లో దళితులపై చిన్నచూపు కనిపిస్తోందని, 'దళిత తేజం' పేరిట పెడుతున్న సమావేశాలు ఎన్నికల స్టంటేనని మోత్కుపల్లి అన్నారు. మరోసారి దళితులను మోసం చేసేందుకు, వాడుకుని వదిలేసేందుకు చంద్రబాబు కదిలారని అన్నారు. చంద్రబాబు మనిషే అయితే, ఆయన దళిత వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబులో కుల అహంకారం ఉందని, ఆయన మనసులో దళితులపై చిన్నచూపుందని ఆరోపించారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి, రెండు దశాబ్దాలుగా పబ్బం గడుపుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మరోసారి మొసలి కన్నీరు కారుస్తూ, దళితులపై కపట ప్రేమను చూపుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రానుందని అన్నారు.