Nara Lokesh: బీరేందర్ సింగ్ జీ, కడప ప్లాంట్ పై రాజకీయాలకు అతీతమైన నిర్ణయం తీసుకోండి: లోకేష్
- ఉక్కు ప్లాంట్ ఏర్పాటును నిరాకరిస్తే భవిష్యత్తు డిమాండ్ తీరేది ఎలా?
- ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన నారా లోకేష్
- ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్వీట్
కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి కడప ఉక్కు ప్లాంటు హామీని ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ మరోసారి గుర్తు చేశారు. ఇందుకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మంత్రి బీరేందర్ సింగ్ వ్యాఖ్యలతో వచ్చిన వార్త ఆధారంగా నిలిచింది. ‘దేశంలో ఉక్కు డిమాండ్ పెరిగేందుకు అపార అవకాశాలున్నాయని మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ అన్నారు. అంతర్జాతీయ సగటు తలసరి ఉక్కు వినియోగం 208 కిలోలు ఉండగా, దేశంలో తలసరి ఉక్కు వినియోగం 68 కిలోలే ఉందని పేర్కొన్నారు’ అంటూ టైమ్స్ కథనంలో ఉంది.
ఈ కథనం లింక్ ను తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ పోస్ట్ చేశారు. ‘‘అంతర్జాతీయ తలసరి ఉక్కు వినియోగం 208 కిలోలకు భారత సామర్థ్యం చేరేందుకు అపార అవకాశాలు ఉన్నాయి, కానీ, కడపలో ఉక్కు ప్లాంట్ ఏర్పాటు వంటి అవకాశాలను కాలదన్నితే భవిష్యత్తు డిమాండ్ ను భారత్ చేరుకునేది ఎలా?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కడప ఉక్కు ప్లాంటు ఏర్పాటు డిమాండ్ ను పరిశీలించి రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.