teacher: నిన్న తమిళనాడులో.. నేడు తెలంగాణలో.. బదిలీ అయిన టీచర్ను వెళ్లనీయబోమని అడ్డుపడిన విద్యార్థులు!
- మహబూబా బాద్ జిల్లాలో ఘటన
- ప్రాథమికోన్నత పాఠశాల టీచర్ సునీత
- ఎన్నో మంచి పనులు చేసిన టీచర్
- బదిలీ అవుతోందని తెలుసుకున్న విద్యార్థులు
ఇటీవల తమిళనాడులోని తిరువల్లూర్లోని వెలైగారం గ్రామంలోని ఓ పాఠశాలలో 28 ఏళ్ల భగవాన్ అనే ఉపాధ్యాయుడికి వేరే పాఠశాలకి బదిలీ అవ్వడంతో.. ఆయనను వెళ్లనివ్వకుండా విద్యార్థులు కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, మహబూబా బాద్ జిల్లా కే సముద్రం మండలం అన్నారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోనూ అటువంటి ఘటనే చోటు చేసుకుంది.
ఆ పాఠశాలలో 54 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా ఆ పాఠశాలలో పనిచేస్తోన్న సునీత అనే టీచర్ వేరే పాఠశాలకు బదిలీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులంతా ఆమె వద్దకు వెళ్లి ఈ స్కూల్లోనే ఉండాలని ఎక్కడికీ వెళ్లకూడదని కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను తమ పాఠశాల నుంచి వెళ్లనీయబోమని కరాఖండీగా చెప్పారు.
మిగతా టీచర్లలా జీతం కోసం మాత్రమే పని చేయకుండా ఆ పాఠశాలలో సునీత టీచర్ ఎన్నో మంచి పనులు చేసింది. విద్యార్థులు పాఠశాలకు రాకపోతే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకువచ్చేవారు. ప్రతి రోజూ ఒక రూపాయి చొప్పున పొదుపు చేసుకోవాలని విద్యార్థులకు చెప్పేవారు. అలా జమ చేసుకున్న డబ్బుతో విద్యార్థులు పుస్తకాలు కొనుక్కునేవారు. అంతేకాదు, మరెన్నో మంచి పనులు చేయడంతో విద్యార్థులు ఆమె పట్ల బంధాన్ని పెంచుకున్నారు.