Congress: దీక్షలపై జోకులు వేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.. ఆ కామెడీ ఎంపీలను తొలగించాలి: ఏపీసీసీ
- ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర పరువును మంట గలిపారు
- ఆ టీడీపీ ఎంపీలను తక్షణమే సస్పెండ్ చేయాలి
- జోకులు వేసుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
- ఢిల్లీ వెళ్లి జోకర్లుగా మారారు
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, హక్కుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పోరాడుతున్నట్లయితే.. ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర పరువును మంట గలిపిన టీడీపీ ఎంపీలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేసింది. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని తోటి ఎంపీ సీఎం రమేష్ చేసిన నిరాహార దీక్ష గురించి, ఇతర ఏపీ సమస్యలపై అత్యంత చులకన భావంతో మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ అడ్డంగా దొరికిపోయినప్పటికీ చంద్రబాబు సదరు ఎంపీలను వెనకేసుకోరావడం దారుణమని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు.
"వీడియోలో అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా న్యాయ విచారణ అంటూ కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేతగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరి వెంటనే 'కామెడీ' ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలను అసమర్థులుగా తూలనాడిన చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీ ఎంపీలు ఏ విధంగా కనిపిస్తున్నారు? ఢిల్లీ వెళ్లిన ఎంపీలు ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర వైఖరిని ఎండగడుతూ అక్కడే మూకుమ్మడిగా నిరాహారదీక్షకు దిగి కేంద్రంపై ఒత్తిడి తేకుండా తీరిగ్గా కూర్చుని తోటి ఎంపీ రాష్ట్రంలో చేస్తున్న దీక్షపై జోకులు వేసుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఢిల్లీ వెళ్లి జోకర్లుగా మారిన ఇలాంటి వారా ఉక్కు కర్మాగారం సాధించేది? వీరి వ్యవహారం చంద్రబాబు చెవికి ఎక్కకపోయినా నాటకాలను నిశితంగా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనం వృథా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం మాని అఖిలపక్షాల ప్రతినిధులతో కలిసి ఢిల్లీలో నిరాహారదీక్ష చేయాలి.
కేంద్రం దిగి వచ్చే విధంగా రాష్ట్రంతో పాటు ఢిల్లీలో సైతం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే తప్ప రాష్ట్రానికి మేలు జరగదు. ఢిల్లీలో ఏపీ చేసే ఉద్యమానికి కాంగ్రెస్ సహా ఎన్డీయేతర పక్షాలన్నీ మద్దతు తెలుపుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కారు చేస్తున్న అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైకాపా, జనసేన, వామపక్షాలు సైతం రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రం కోసం ఐక్య కార్యాచరణతో ఉద్యమించాలి.
రాష్ట్రంలో రాజకీయ అనైక్యతను ఆసరాగా చేసుకుని ఆంధ్రులతో ఆడుకుంటున్న బీజేపీ పెద్దలకు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వుండాలనేది ఐదుకోట్ల మంది ఆంధ్రులు నిర్ణయిస్తారు.. కేవలం అధికారమే పరమావధిగా రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడటం సరికాదని అన్ని రాజకీయపక్షాలు ఆలోచన చేయాలి" అని అన్నారు.