diabetis: గాలి కాలుష్యం వల్ల మధుమేహం.. 30 లక్షల డయాబెటిస్ కేసులు
- పరిశోధనలో తేలిన కీలక విషయాలు
- కలుషిత గాలి వల్ల మనిషిలో ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం
- రక్తంలోని గ్లూకోజ్ శక్తిగా మారకుండా అడ్డు
- 2016లో గాలి కాలుష్యం వల్ల 30 లక్షల మధుమేహం కేసులు
భారత్‌లోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ కాలుష్యం మనుషుల్లో పలు వ్యాధులకు కారణం అవుతోంది. దీని కారణంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా అధికమని తాజాగా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడం కూడా ఓ కారణమని పరిశోధకులు గుర్తించారు.
కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.. రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారని గర్తించారు.
పర్యావరణ రక్షణ సంస్థ (ఈపీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2016లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మధుమేహ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.