chiranjeebi: ఎస్వీఆర్ కు ఫాల్కే అవార్డు వచ్చేలా ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృషి చేయాలి!: చిరంజీవి
- ఎస్వీఆర్ సినీ రంగాన్ని ఏలుతున్న రోజుల్లో నేను చిన్న పిల్లాడిని
- ఆయనను కలసి ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నా
- నేను సినిమాల్లోకి వచ్చే సమయానికే ఆయన మన మధ్య లేరు
మహానటుడు ఎస్వీ రంగారావు గురించి మాట్లాడేంత స్థాయి, అర్హత తనకు ఉన్నాయని తాను అనుకోవడం లేదని మెగాస్టార్ చిరంజీవి వినమ్రంగా చెప్పారు. ఆయన చలన చిత్ర రంగాన్ని ఏలుతున్న రోజుల్లో తాము చిన్నపిల్లలమని.. ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతున్నానని తెలిపారు.
ఆ సమయంలో తన తండ్రి వెంకట్రావు 'జగత్ కిలాడీలు', 'జగత్ జెట్టీలు' సినిమాలలో చిన్నచిన్న పాత్రలు వేశారని చెప్పారు. 'జగత్ కిలాడీలు' చిత్రంలో ఎస్వీఆర్ తో కలసి నటించారని... ఆయన గురించిన అనుభవాలను నాన్న చెబుతుంటే మైమరచి వినేవాడినని తెలిపారు. ఆ తర్వాత ఆయనపై అభిమానం రోజురోజుకూ పెరుగుతూ వచ్చిందని చెప్పారు. ఎస్వీఆర్ తో కలసి నటించే అదృష్టం తనకు కలగకపోయినప్పటికీ... ఆయన ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నానని... తాను సినిమాల్లోకి రావాలని అనుకునే సమయానికే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇదొక తీరని లోటని చెప్పారు.
ఎస్వీఆర్ అంటే సహనటులు ఎందుకు టెన్షన్ పడతారంటే... ఒకసారి నటించినట్టు మరోసారి ఆయన నటించరని చిరంజీవి అన్నారు. ఆయన స్పీడ్ ను అందుకోవడం సహనటులకు చాలా కష్టమని చెప్పారు. మహానటుడైన ఎస్వీఆర్ కు ఎలాంటి పురస్కారం దక్కకపోవడం బాధగా ఉందని... దానికి సంబంధించిన కారణాల గురించి తాను మాట్లాడనని అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్వీఆర్ కు ఫాల్కే అవార్డు వచ్చేలా కృషి చేయాలని విన్నవించుకుంటున్నానని చెప్పారు. ఓ మీడియా సంస్థతో చిరంజీవి మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు.