jagan: కోనసీమ ప్రజలు మురికి నీరు తాగుతున్నారా?: జగన్ పై చినరాజప్ప ఫైర్
- అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారు
- పాదయాత్ర చేసిన జగన్ కు అభివృద్ధి కనిపించలేదా?
- జనాల చెవుల్లో పువ్వులు పెట్టేందుకే జగన్ పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రజలు మురికి నీరు తాగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ కు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
ధర్మపోరాట దీక్షపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. లక్ష మందికి పైగా దీక్షకు తరలి వచ్చారని, ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేశామని జగన్ ఆరోపించారని... కార్యకర్తలు చందాలు వేసుకుని ఆర్టీసీ బస్సులకు డబ్బులు చెల్లించారని అన్నారు. జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
దళిత తేజం నిర్వహించే అర్హత టీడీపీకి లేదన్న హర్షకుమార్ కు ఏ అర్హత ఉందని చినరాజప్ప ప్రశ్నించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ నిధులను ఇతర పనులకు మళ్లిస్తే హర్షకుమార్ ఏం చేశారని నిలదీశారు. కోనసీమ రైతుల కష్టాలను తీర్చేందుకు పూడిక తీత పనులను చేపడతామని చెప్పారు.