facebook: వినియోగదారుల డేటాను 52 కంపెనీలతో పంచుకున్నాం: ఫేస్ బుక్ వెల్లడి
- 52 కంపెనీలతో డేటాను పంచుకున్న ఫేస్ బుక్
- వీటిలో చైనాకు చెందిన కంపెనీలు కూడా
- అమెరికన్ ప్రతినిధుల సభకు ఫేస్ బుక్ నివేదిక
ప్రపంచ వ్యాప్తంగా 52 కంపెనీలతో వినియోగదారుల డేటాను పంచుకున్నామని ఫేస్ బుక్ యాజమాన్యం ఒప్పుకుంది. వీటిలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికన్ కాంగ్రెస్ కు ఆ కంపెనీ ఇచ్చిన వివరణలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు దాదాపు 700 పేజీల నివేదికను అమెరికన్ ప్రతినిధుల సభకు చెందిన హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి సమర్పించింది.
ఫేస్ బుక్ సమాచారాన్ని పంచుకున్న కంపెనీలలో శాంసంగ్, పాన్ టెక్, క్వాల్ కామ్, బ్లాక్ బెర్రీ, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలతో పాటు చైనాకు చెందిన హ్యువాయ్, లెనొవో, టీసీఎల్, ఒప్పోలు కూడా ఉన్నాయి. ఆయా కంపెనీలతో ఫేస్ బుక్ అనుసంధానం కోసం, వినియోగదారుకు మెరుగైన సేవలను అందించేందుకు ఈ ఒప్పందాలు చేసుకున్నామని చెప్పింది. 52 కంపెనీల్లో ఇప్పటికే 38 కంపెనీలతో ఒప్పందాలు ముగిశాయని, జులైలో మిగిలిన కంపెనీల కాలపరిమితి కూడా ముగుస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఫ్రాంక్ మాట్లాడుతూ, ఫేస్ బుక్ సమాధానాలు మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని చెప్పారు.