Rahul Gandhi: జీఎస్టీ విషయంలో రాహుల్ ఆలోచన చాలా తప్పు!: అరుణ్ జైట్లీ
- అన్ని వస్తువుల పన్నును ఒకే శ్లాబు కిందకు తీసుకురావడం అసాధ్యం
- ప్రజలందరికీ ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంటేనే అది సాధ్యం
- ఇప్పటికే చాలా వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించాం
దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఒకే శ్లాబులో ఉండాలన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ గాంధీ చెప్పిన నిర్ణయాన్ని తీసుకుంటే అది ముమ్మాటికీ అవివేకమైన నిర్ణయమవుతుందని చెప్పారు. ఒకే విధమైన జనాభా ఉండి, ప్రజలందరికీ ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్నప్పుడే ఒకే శ్లాబు పెట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 'ది జీఎస్టీ ఎక్స్ పీరియెన్స్' అనే ఆర్టికల్ లో తన అభిప్రాయాలను జైట్లీ ఈ మేరకు వెల్లడించారు.
దేశంలోని వస్తువులన్నింటి పన్నులను ఒకే పరిధిలోకి తీసుకు రావాలని రాహుల్ సూచిస్తున్నారని... ఆయన ఆలోచన చాలా తప్పు అని జైట్లీ అన్నారు. సింగపూర్ ప్రజలకు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉందని... అలాంటి చోట అయితే ఒకే శ్లాబును అమలు చేయవచ్చని చెప్పారు. ఇరు దేశాల జనాభా సంఖ్యలో కూడా పూర్తి వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇప్పటికే చాలా వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించామని తెలిపారు.