Parlament of India: ఇక రోజుకు 5 ప్రశ్నలు మాత్రమే అడగాలి... ఎంపీలపై లోక్ సభ పరిమితి!
- ప్రస్తుతం రోజుకు 10 ప్రశ్నలు అడిగే అవకాశం
- సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్
- ఉత్తర్వులు వెలువరించిన లోక్ సభ సెక్రటరీ జనరల్
ఇకపై లోక్ సభ సభ్యులు రోజుకు 5 ప్రశ్నలను మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 10 ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఉండగా, దాన్ని 5 ప్రశ్నలకు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ కొత్త మార్పు అమలులోకి వస్తుందని లోక్ సభ 'క్వశ్చన్స్ సెల్' ఓ బులెటిన్ లో తెలిపింది.
లోక్ సభ స్పీకర్ ఆదేశాల మేరకు, ఇకపై ఏ సభ్యుడు కూడా రోజుకు 5 ప్రశ్నలు మించి అడగటానికి వీల్లేదు. రోజుకు వచ్చే ప్రశ్నల సంఖ్య సగటున 230 దాటుతోందని, ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కష్టతరమని భావించిన నేపథ్యంలోనే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని లోక్ సభ వర్గాలు వెల్లడించాయి. ఈ బులెటిన్ లోక్ సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవ్ సంతకంతో వెలువడింది.