New Delhi: మా వాళ్లకు మూఢ నమ్మకాలు లేవు.. ఇవి హత్యలే!: 'ఢిల్లీ సామూహిక మరణాల'పై బంధువులు
- 11 మంది అనుమానాస్పద మృతి
- ఆత్మహత్యలంటున్న పోలీసులు
- కొట్టి పారేస్తున్నబంధువులు
దేశ రాజధాని ఢిల్లీలోని బురారి ప్రాంతంలో జరిగిన 11 మంది కుటుంబ సభ్యుల సామూహిక మరణాల ఉదంతం మిస్టరీగా మారుతోంది. మోక్షాన్ని పొందడం కోసం వీరంతా సామూహిక ఆత్మహత్యలు చేసుకుని ఉంటారంటూ పోలీసులు చెబుతున్న కథనాన్ని మృతుల బంధువులు మాత్రం నమ్మడం లేదు. తమ వారికి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని, పైగా వారంతా చదువుకున్న వారని, మూఢ నమ్మకాలు కూడా వీరికి లేవని, అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకునే అవసరం వీరికి ఏమొస్తుందని చనిపోయిన వృద్ధురాలు నారాయణ్ దేవి మనవడు కేతన్ నాగపాల్ ప్రశ్నించాడు.
'ఒకవేళ వారు ఆత్మహత్యలే చేసుకున్నారనుకుందాం. అలాంటప్పుడు కళ్లకు గంతలు ఎందుకు కట్టుకుంటారు? నోట్లో గుడ్డలు ఎందుకు కుక్కుకుంటారు? చేతులు ఎందుకు కట్టేసుకుంటారు? ఇదంతా చూస్తుంటే ఎవరో ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా కనిపిస్తున్నాయి" అన్నాడు కేతన్. మరో బంధువు మాట్లాడుతూ, శనివారం రాత్రి వారు తమతో ఫోన్ లో మాట్లాడారనీ, ఆ సమయంలో వారి మాటల్లో ఎటువంటి ఒత్తిడి, తట్రపాటు లేవని, అందుకే ఎవరో వీరిని హత్య చేశారనే తాము నమ్ముతున్నామని అన్నారు. మరోపక్క, మృత దేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేయించిన పోలీసులు అసలు కారణాలను వెలికి తీయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.