Telangana: త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు!
- అర్చకులు, ఆలయ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ
- కొనసాగుతున్న కసరత్తు, ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధం
- దేవాదాయ శాఖ సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతోందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి అంటే జూన్ 2, 2014 కంటే ముందు నియమించబడ్డవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై ఈరోజు హైదరాబాద్, బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, దేవాదాయ శాఖ ఇంచార్జ్ సీఈ సత్యనారాయణ రెడ్డి, ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, సహాయక కమిషనర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... ఆగస్టు 1 నుంచి మరిన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనలకు లోబడి అర్హమైన ఆలయాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పటి వరకు 5,289 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల అనర్హులైన వారిని ధూప దీప పథకంకు సిఫారసు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మరింత పారదర్శకంగా ఉండేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రతి ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన అర్చకుల జాబితాను జూలై నెలాఖరు కల్లా సమర్పించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకవేళ అనర్హులను ఎంపిక చేస్తే... సంబంధిత అధికారిదే పూర్తి బాధ్యతని, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణ పూర్తయి నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న ఆలయ అర్చకులకు ఆగస్టు నుంచి ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తామన్నారు. కొన్ని ఆలయాల్లో అర్చకులుగా పని చేస్తున్న విశ్వకర్మలతో పాటు గిరిజన ఆలయ పూజారులకు కూడా ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.
భద్రాచలం, బాసర, ధర్మపురి ఆలయాల బృహత్ ప్రణాళిక..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర, ధర్మపురి ఆలయాల బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను సిధ్దం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాలకున్న భూమి ఎంత? సౌకర్యాల కల్పన, పనుల ప్రాధాన్యతను బట్టి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఈ ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించారని ఈ సందర్భంగా వెల్లడించారు. కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ తో మాస్టర్ ప్లాన్ ను రూపొందించి, మార్పులు, చేర్పుల తరువాత రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కామన్ గుడ్ ఫండ్ పనుల్లో వేగం పెంచండి..
కామన్ గుడ్ ఫండ్ ద్వారా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నప్పటికి మరింత వేగంగా పనులను పూర్తి చేయాల్సిన అవసరముందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు కామన్ గుడ్ ఫండ్ పనులు అప్పగించిన చోట వారితో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.
పనుల పురోగతిని బట్టి కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. మరోవైపు కొన్ని దేవాలయాల భూములకు సంబంధించి ఇంకా పట్టదార్ పాస్ పుస్తకాలు అందలేదని, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఆయా దేవాలయాల పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు తీసుకోవాలని జిల్లా సహాయక కమిషనర్లను మంత్రి ఆదేశించారు.