PRTU: ఏపీ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడి సస్పెన్షన్.. సంతకాల ఫోర్జరీ కేసులో వేటు!
- పీఆర్‌టీయూకు ఎన్నికలు నిర్వహించని కమలాకర్‌రావు
- తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నిర్వహించినట్టు చూపించిన వైనం
- అక్రమంగా ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని వినియోగించుకున్న పీఆర్‌టీయూ నేత
ఆంధ్రప్రదేశ్ పీఆర్‌టీయూ అధ్యక్షుడు ఎం.కమలాకర్‌రావును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా పెడన మండలంలోని చేవెండ్ర జెడ్పీ హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గతేడాది మేలో పీఆర్‌టీయూకి ఎన్నికలు నిర్వహించకుండానే జరిపినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు తేలింది. అంతేకాక, అక్రమ పద్ధతిలో ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు.
కమలాకర్‌రావు అక్రమాలపై విచారణ జరిపిన విద్యాశాఖ సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్టు నిర్ధారించింది. దీంతో ఆయన ఉపయోగించుకున్న ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని రద్దు చేయడంతోపాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సాధారణ పరిపాలన శాఖ మే 8న జీవో జారీ చేసింది. దీంతో డీఈవో రాజ్యలక్ష్మి ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.