Thailand: పది రోజుల నుంచి తప్పిపోయి గుహలో తిరుగుతున్న థాయ్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సేఫ్.. వీడియో విడుదల!
- జూన్ 23న గుహలోకి థాయ్ యూత్ ఫుట్ బాల్ టీమ్
- వారంతా క్షేమంగానే ఉన్నారన్న వీడియో
- వీడియోను విడుదల చేసిన థాయ్ నేవీ సీల్స్
గడచిన పది రోజులుగా ఓ లోతైన గుహలో చిక్కుకుపోయి బయటకు రాలేక అక్కడే గడుపుతున్న థాయ్ యూత్ ఫుట్ బాల్ టీమ్ లోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఓ వీడియో విడుదలైంది. ఓ గుహలో మట్టి, బురదనీరు మధ్య వీరంతా చిక్కుకుపోయి, ఆకలితో అలమటిస్తూ, తమకు కనీసం ఆహారం పంపాలని వేడుకుంటున్నారు. థాయ్ నేవీ సీల్స్ విడుదల చేసిన ఈ వీడియోలో ఫుట్ బాల్ జర్సీలు ధరించిన వీరంతా మోకాళ్లపై కూర్చుని ఉన్నారు. తమను బయటకు తీసుకెళ్లాలని అడుగుతున్నారు. ఈ వీడియోను సోమవారం నాడు తీశామని చెబుతూ నేవీ సీల్స్ తన ఫేస్ బుక్ అధికార పేజీలో వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో గుహలోకి వెళ్లిన డైవర్, బ్రిటిష్ ఇంగ్లీష్ యాసతో మాట్లాడుతూ, మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడకు చాలామంది రానున్నారని, తొలుత తాను వచ్చానని, అందరినీ బయటకు తీసుకెళ్తామని చెప్పాడు. జూన్ 23, శనివారం నుంచి వీరంతా గుహలో చిక్కుకుపోయి ఉన్నారు. ఇక ఈరోజు ఏం వారం? మాకు ఆకలిగా ఉంది. బయటకు వెళ్దామా? అని వారు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి "నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవాళ కాదు. మీరు ఇక్కడ 10 రోజుల నుంచి ఉన్నారు. మీరు ధైర్యవంతులు. అందరినీ తీసుకెళ్తాం" అని ధైర్యం చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.