Yadagirigutta: యాదగిరిగుట్ట పుష్కరిణి మూసివేత.. విస్తరణ పనులు షురూ!

  • రూ. 20 కోట్లతో విస్తరణ పనులు
  • రెండు నెలల పాటు మూసివేత
  • ప్రకటించిన వైటీడీఏ

శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణిని రెండు నెలల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కరిణి విస్తరణ పనులను ప్రారంభిస్తున్నామని, అందువల్ల కనీసం రెండు నెలల పాటు భక్తులను స్నానాలకు అనుమతించబోమని, నీటిని తొలగించి పనులు చేపట్టనున్నామని వైటీడీఏ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు సహకరించాలని కోరింది. కాగా, పుష్కరిణి విస్తరణకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే రూ. 20 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకేసారి 10 వేల మంది స్నానం చేయడానికి వీలుగా వెడల్పును పెంచడంతో పాటు, లోతును కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు.

పుష్కరిణి ముందు కమాన్, దానిపై విష్ణుమూర్తి విగ్రహం, నీటి మధ్యలో మండపం, దానిపై స్వామివారి పాదాలు, కొలను చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు కానున్నాయి. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ పుష్కరిణిలో నిత్యమూ నీరు ఊరుతుంటుంది. దీని వెడల్పు 36 మీటర్లు కాగా, పొడవు 18 మీటర్లుంది. లోతు చాలా తక్కువ. ప్రస్తుతమున్న పుష్కరిణి, పెరుగుతున్న భక్తుల అవసరాలకు సరిపోవడం లేదని భావించిన అధికారులు, విస్తరణ పనులు చేపట్టారు.

  • Loading...

More Telugu News