Rajasthan: ఎన్నికల వేళ రాజస్థాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన.. ఐదు కులాలకు రిజర్వేషన్!
- ఈ నెల 7న జైపూర్లో మోదీ పర్యటన
- అంతకంటే ముందే రిజర్వేషన్ల ప్రకటన
- గుజ్జర్లు సహా ఐదు కులాలకు వర్తింపు
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుజ్జర్లు సహా రాష్ట్రంలోని ఐదు కులాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన కేటగిరీ (ఎంబీసీ) కింద ప్రకటించిన రిజర్వేషన్లను వర్తింపజేస్తామని పేర్కొంది. గుజ్జర్లు, గోడియా లోహర్, బంజారా, రైకా, గడరియా కులాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఈనెల 7న ప్రధాని నరేంద్రమోదీ జైపూర్లో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను మోదీ కలుసుకోనున్నారు. దీంతో ర్యాలీలో నిరసన తెలిపేందుకు గుజ్జర్లు ప్రణాళిక రచించారు. విషయం తెలిసిన ప్రభుత్వం అంతకంటే ముందే రిజర్వేషన్లు ప్రకటించి చెక్ పెట్టింది.