latha rajanikanth: రజనీకాంత్ భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- యాడ్ బ్యూరో సంస్థ నుంచి రూ. 10 కోట్ల రుణం
- ఇంకా తిరిగి చెల్లించని వైనం
- వెంటనే చెల్లించాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ భార్య లతారజనీకాంత్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొచ్చాడయాన్ సినిమా హక్కుల అమ్మకానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమెను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బకాయిలను చెల్లించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రజనీ కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో... ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది.
కొచ్చాడయాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం యాడ్ బ్యూరో నుంచి మీడియా వన్ సంస్థ రూ. 10 కోట్ల రుణం తీసుకుంది. మీడియా వన్ కు లతారజనీకాంత్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒప్పందం ప్రకారం వడ్డీతో సహా డబ్బును చెల్లిస్తామని చెప్పి, ఆ తర్వాత కొంచెం మొత్తాన్ని మాత్రమే చెల్లించి, చేతులు దులిపేసుకున్నారని ఆరోపిస్తూ 2016లో యాడ్ బ్యూరో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు మాట మాత్రం చెప్పకుండా రెట్టింపు ధరకు తమిళ హక్కులను ఈరోస్ సంస్థకు అమ్ముకున్నారని తెలిపింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కొచ్చాడయాన్ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.