child: హైదరాబాద్‌లో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యం.. కాసేపట్లో తిరిగి నగరానికి!
- కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నిన్న అదృశ్యం
- బీదర్ ఆసుపత్రిలో దొరికిన ఆడశిశువు
- నిందితురాలి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అదృశ్యమైన ఆడశిశువు ఆచూకీ పోలీసులకు దొరికింది. ఆ పాప బీదర్‌లో ఉందని తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చి, ఆమె కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉంటోంది. నిన్న ఆమె వద్దకు వచ్చిన ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, తిరిగి రాలేదు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా పలు ఆధారాలు లభ్యమయ్యాయి. అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం గాలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ పసిపాప బీదర్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దొరికిందని పోలీసులు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.