green high way: ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలు
- జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం
- ఆయా నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల
- ఈ రహదారి మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి
ఖమ్మం - రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారత ప్రభుత్వ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అభీష్టానుసారం ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలు రచించినట్టు జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అధికారి తెలిపారు.కాగా, గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రానికి అనుమతించిన ప్రాజెక్టులలో భాగంగా ఈ రహదారిని రూపొందిస్తారు. ఈ రహదారి నిడివి 167 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఈ రహదారి మొత్తాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. ఎక్కడా కూడా నివాస ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఆలయాలు వంటి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈ మొత్తం రహదారిని రూపొందిస్తారు. ఎంతో విలువైన అనుసంధానాన్ని కలిగించడమే కాకుండా బాగా వెనుకబడిన ప్రాంతాల మండలాలైన కూసుమంచి అశ్వారావుపేట రైతులకు తమ ప్రాంతాల నుండి సమీప మార్కెట్ లకు తమ ఉత్పత్తుల తరలింపునకు చాలా అనుకూలంగా ఉంటుంది.ఖమ్మం – రాజమండ్రి రహదారి అనుసంధానం వలన రాజమండ్రి నుండి హైదరాబాద్ ప్రయాణ దూరం మొత్తంగా 80 కిలోమీటర్ల నిడివి తగ్గనుంది. ఈ రహదారి విజయవాడ నగరంపై ఉండే వత్తిడిని, రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం వంటి ముఖ్య నగరాలను హైదరాబాద్ కు అనుసంధానించడానికి ఈ రహదారి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భవిష్యత్తులో ఆయా పట్టణాల నుంచి హైదరాబాద్ కు ప్రయాణించేవారి సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఎంతో విలువైన ఇంధనం కూడా ఆదా అయ్యే విధంగా ఈ ప్రణాళికను తీర్చిదిద్దారు. వచ్చే 15 రోజుల్లోగా భూ సేకరణ పూర్తిగావించి టెండర్లు ఖరారు చేయనున్నామని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు.