England: కుల్దీప్ కూల్చేశాడు.. రాహుల్ ఊచకోత కోశాడు.. ఇంగ్లండ్ తో తొలి టీ20లో భారత్ ఘన విజయం!
- మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజ
- 5 వికెట్లు కూల్చి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన కుల్దీప్
- సెంచరీతో రెచ్చిపోయిన రాహుల్
భారత జట్టు తమ పర్యటనను విజయవంతంగా ప్రారంభించింది. ఇంగ్లండ్ తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ జట్టును టీమిండియా లెప్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులతో వణికించాడు. బాణాల్లా దూసుకువచ్చిన బంతులను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన కుల్దీప్ 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. ఓపెనర్లు జాసన్ రాయ్ (30), జోస్ బట్లర్ (69), డేవిడ్ విల్లీ (29) తప్ప ఇంగ్లిష్ జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు ఓ మాదిరి లక్ష్యం ఉంచింది.
లక్ష్య ఛేదనలో భారత్ అదరగొట్టింది. లోకేశ్ రాహుల్ అద్భుత సెంచరీతో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో రాహుల్ 101 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 32, కెప్టెన్ కోహ్లీ 20 పరుగులు చేశారు. దీంతో మరో పది బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. బౌలింగ్‌లో ఇంగ్లండ్ వెన్ను విరిచిన కుల్దీప్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.