Hyderabad: శంషాబాద్‌లో ప్రయాణికులకు నరకం చూపించిన అల్ జజీరా విమానం

  • 20 గంటలు ఆలస్యంగా బయలుదేరిన విమానం
  • విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
  • ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన యాజమాన్యం

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్ జజీరా విమానం ప్రయాణికులకు నరకం చూపించింది. కువైట్ వెళ్లాల్సిన 65 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో దాదాపు ఓ రోజంతా పడిగాపులు కాశారు. పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి 20 గంటల తర్వాత విమానం గాల్లోకి ఎగిరింది.

మంగళవారం తెల్లవారుజామున 2:20 గంటలకు అల్ జజీరాకు చెందిన జే9-609 విమానం శంషాబాద్ నుంచి కువైట్‌కు వెళ్లాల్సి ఉంది. దీంతో ప్రయాణికులంతా దాని కోసం వేచి చూస్తుండగా, విమానం అసలు శంషాబాద్‌కే రాలేదన్న విషయం తెలిసి ప్రయాణికులు నివ్వెరపోయారు. సాంకేతిక కారణాల వల్ల విమానం రాలేదని, బోర్డింగ్ పాస్‌లు తీసుకున్న వారు సాయంత్రం రావాలని అధికారులు సూచించారు. దీంతో కొందరు వెనక్కి వెళ్లిపోగా మరికొంతమంది అక్కడే పడిగాపులు కాశారు. సాయంత్రం ఎయిర్‌లైన్స్ అధికారులు మరో ప్రకటన చేయడంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో దిగి వచ్చిన అధికారులు రాత్రి 9:30 గంటలకు ప్రయాణికులను కువైట్ పంపించడంతో కథ సుఖాంతమైంది.

  • Loading...

More Telugu News