Jimbabwe: ఫించా... మజాకా?...76 బంతుల్లో 172 కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డు
- జింబాబ్వేతో టీ-20 మ్యాచ్
- 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
- తన రికార్డును తానే బద్దలు కొట్టిన ఫించ్
అరోన్ ఫించ్... ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ టీ-20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 76 బంతుల్లోనే 172 పరుగులు కొట్టాడు. తన హార్డ్ హిట్టింగ్ తో తొలి 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసిన ఫించ్, ఆపైనా అదే దూకుడు ప్రదర్శిస్తూ, 50 బంతుల్లో సెంచరీ చేరుకున్నాడు. ఆపై ఫించ్ ని అడ్డుకోవడం జింబాబ్వే బౌలర్ల తరం కాలేదు.
ఫించ్ విధ్వంసంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా, జింబాబ్వేను 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులకు కట్టడి చేసి 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరో ఎండ్ లోని షార్ట్ (46)తో కలిసి టీ-20ల్లో ఏ వికెట్ కైనా తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డునూ ఫించ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకూ టీ-20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (156) కూడా ఫించ్ పేరిటే ఉండగా, తన రికార్డును తానే అధిగమించాడీ ఆస్ట్రేలియా ఆటగాడు.