lunar eclipse: ఈ శతాబ్దంలోనే అద్భుతం.. ఈనెల 27న సుదీర్ఘ చంద్ర గ్రహణం!
- దాదాపు రెండు గంటలు కొనసాగనున్న చంద్ర గ్రహణం
- దేశంలోని అన్ని ప్రాంతాల వాసులకు కనువిందు
- అర్ధరాత్రి ఒంటి గంటకు చంద్రుడు మాయం
ఈ నెల 27న ఈ శతాబ్దంలోనే అరుదైన అద్భుతం చోటుచేసుకోబోతోంది. ఆ రోజు రాత్రి 21వ శతాబ్దంలోనే అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం పట్టనుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది చాలా అద్భుతమైన అవకాశమని, ప్రతి ఒక్కరు తప్పక వీక్షించాలని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీప్రసాద్ దౌరీ అన్నారు. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుందని ఆయన వివరించారు. భారత్‌లోని అన్ని ప్రాంతాల వాసులు గ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చని తెలిపారు.
జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చని దౌరీ తెలిపారు. ఈ ఏడాది జనవరి 31న కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.