nitish kumar: ఎన్డీయేకు దూరమవ్వాలనుకుంటున్న నితీశ్ కుమార్!
- బీజేపీ, జేడీయూల మధ్య పెరుగుతున్న దూరం
- లోక్ సభ సీట్ల పంపకాల విషయంలో తీవ్రమైన విభేదాలు
- మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్న నితీష్ కుమార్
ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని, బీజేపీ అండతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్... తిరిగి మహాకూటమిలో చేరేందుకు యత్నిస్తున్నారని సమాచారం. ఎన్డీయే కూటమిలో ఆయన ఇమడలేకపోతున్నారని చెబుతున్నారు. తిరిగి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలోకి చేరాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై నితీశ్ విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.
లోక్ సభ సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జేడీయూ పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ కు ఇటీవల నితీశ్ ఫోన్ కూడా చేసి, మాట్లాడారు. దీంతో, బీహార్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మహాకూటమిలోకి జేడీయూను మళ్లీ ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇటీవల కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించారు. అయితే, మహాకూటమిలోకి నితీశ్ ను మళ్లీ రానివ్వబోమంటూ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా... మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.