pingali venkaiah: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ప్రముఖుల నివాళులు
- నేడు పింగళి వెంకయ్య 55వ వర్ధంతి
- మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్ నివాళులు
- వెంకయ్య జన్మస్థలం మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు
దేశ ప్రజలకు జాతీయ పతాకాన్ని బహూకరించిన మహనీయుడు, ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు పింగళి వెంకయ్య 55వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఈ మహనీయుని సేవలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఈ ఉదయమే మమత ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయన జాతీయ పతాక రూపకర్తగా సుపరిచితులని పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సైతం... జాతీయ పతాక రూపకర్తకు నివాళులంటూ ట్వీట్ చేశారు.
పింగళి వెంకయ్య 1876 ఆగస్ట్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 మధ్య విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు.
మహాత్మాగాంధీ సమకాలికుల్లో వెంకయ్య ఒకరు. గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు. 1963 జూలై 4న వెంకయ్య ఈ లోకాన్ని వీడి వెళ్లారు.