agriculture: వరికి రూ.200 చొప్పున కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర సర్కారు
- దేశంలో వరి ఉత్పత్తి మరింత పెరుగుతుందని యోచన
- ఇక క్వింటాలుకు మద్దతు ధర రూ.1750
- మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచే అవకాశం
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018-19 ఏడాదికి గానూ వరికి క్వింటాలుకు రూ.200 మేర మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో వరి ఉత్పత్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది వరి పంట ఉత్పత్తి 11.1 కోట్ల టన్నులతో కొత్త రికార్డును అందుకుంది. ఈ ఏడాది రూ.200 మద్దతు ధర పెంచడంతో క్వింటాలుకు మద్దతు ధర రూ.1750కు చేరింది.
అంతేగాక, మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచడానికి సైతం కేంద్ర సర్కారు ఒప్పుకుంది. వచ్చే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోద ముద్ర వేయనున్నారు. సాధారణంగా పంట వేసే ముందు కేంద్ర సర్కారు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఆ ప్రకటన మేరకు రైతులు ఏ పంట వేయాలన్న నిర్ణయం తీసుకుంటారు.