New Delhi: సుప్రీంకోర్టు తీర్పు తరువాత కేజ్రీవాల్ తొలి ఆర్డర్... వెంటనే రిజక్ట్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్!
- కోర్టు తీర్పు తరువాత కూడా మారని పరిస్థితి
- బదిలీలు చేసే అధికారం తనదేనన్న ఎల్జీ
- విమర్శలు గుప్పించిన ఆప్ నేతలు
ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనని, లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్తం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత ఆప్ ప్రభుత్వం ఇచ్చిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. కోర్టు తీర్పు వెలువడిన గంటల తరువాత, అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఇంత ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్ చార్జ్ గా ఉంటారని చెబుతూ, ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్టు ఎల్జీ కార్యాలయం ప్రకటించింది.
ఎల్జీ తాజా నిర్ణయంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం ఎల్జీ పక్కన బెడుతున్నారని విమర్శించారు. "నిన్నటి తన తీర్పులో కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో ఎల్జీకి అధికారం లేదు. కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఆప్ నేత ఒకరు ఆరోపించారు.
సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎల్జీకి బదిలీ ఆదేశాలు, పోస్టింగులపై సంతకాలు చేసే అధికారం లేదని, సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కే బదిలీల అధికారం ఉందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు.