Karnataka: మినిస్టర్ గారి నమ్మకాలు.. ప్రతిరోజు 350 కి.మీ. ప్రయాణిస్తోన్న కర్ణాటక మంత్రి!
- ఓ జ్యోతిష్యుడు చెప్పిన విషయానికి భయపడ్డ కర్ణాటక మంత్రి
- నగరంలోని సొంతింట్లో నిద్రిస్తే కీడు జరుగుతుందట
- ప్రతిరోజు నియోజక వర్గానికి పయనం
కొందరిలో కొన్ని నమ్మకాలు ఎంత బలీయంగా ఉంటాయన్న దానికి ఇదొక నిదర్శనం. ఓ జ్యోతిష్యుడు చెప్పిన విషయానికి భయపడిన కర్ణాటక మంత్రి, ఆ రాష్ట్ర సీఎం సోదరుడు రేవణ్ణ ప్రతిరోజు 350 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజు ఆయన అంతదూరం ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తుండగా ఆయనకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
'మంత్రిగా ఉన్నంతవరకు బెంగళూరులో సొంత ఇంట్లో నివాసం వుండడం చాలా కీడు. మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన సమయం అటువంటిది' అంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో, ఆయన మాటలపై ఎంతో నమ్మకం వుండే రేవణ్ణ దానిని తు.చ తప్పక పాటిస్తున్నాడు. దాంతో నగరంలో తనకి సొంత ఇల్లు ఉన్నప్పటికీ, రాత్రుళ్లు అక్కడ నిద్రపోవడం లేదు. నగరానికి సుమారు 175 కిలో మీటర్ల దూరంలోని తన సొంత నియోజక వర్గమైన హోలేనరసిపురకు వెళ్లి అక్కడ ఓ ఇంట్లో నిద్ర చేస్తున్నారు.
అక్కడ ఉదయం ఐదింటికే నిద్రలేచి, పూజ పూర్తయ్యాక, నియోజక వర్గ ప్రజలు, నేతలతో కాసేపు మాట్లాడతారు. ఎనిమిదింటికి బయలుదేరి 11.30 ప్రాంతంలో బెంగళూరుకు చేరుకుంటారు. మళ్లీ రాత్రి 9 ప్రాంతంలో నగరంలో బయలుదేరి అర్థరాత్రికి నియోజకవర్గానికి చేరుకుంటారు.
వాస్తవానికి బెంగళూరు, కుమార పార్క్ వెస్ట్ ప్రాంతంలో మంత్రి కోరుకున్న 'లక్కీ బంగళా'ను ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే, అందులో మాజీ మంత్రి మహదేవప్ప గత ఐదేళ్ల నుంచి నివాసం వుంటున్నారు. ఆయన ఖాళీ చేయడానికి మూడు నెలలు పడుతుందట. జ్యోతిష్యుని సూచన మేర తనకు ఆ బంగాళానే కావాలని రేవణ్ణ పట్టుబడుతున్నారు. దాంతో ఆయన ఖాళీ చేసేవరకు ప్రతి రోజూ మంత్రిగారికి ఈ 350 కిలోమీటర్ల షటిల్ సర్వీసు తప్పదన్నమాట.