satyameva jayate: జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’లో అభ్యంతరకర దృశ్యాలు... సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
- మొహర్రం పండగ సంప్రదాయాలను చెడ్డ కోణంలో చూపించారు
- అవి షియా కమ్యూనిటీ మనోభావాలను గాయపరిచేవి
- వాటిని తొలగించాలని బీజేపీ మైనారిటీ విభాగం నేత ఫిర్యాదు
జాన్ అబ్రహాం నటించిన సత్యమేవ జయతే సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యేట్టు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో షియా కమ్యూనిటీ మనోభావాలను గాయపరిచే దృశ్యాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అలీ జఫ్రి హైదరాబాద్ లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్లో మొహర్రం పండుగ సంప్రదాయాన్ని చెడ్డ కోణంలో చూపించారని జఫ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ట్రైలర్ లో ఓ దృశ్యం ఉంది. అందులో మొహర్రం పండగ రోజున మాతమ్ (స్వీయ దండన)ను చూపించారు. మాతమ్ తర్వాత నటుడు హత్యకు పాల్పడతాడు. ఇది మా మనోభావాలను గాయపరిచేది’’ అని జఫ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ముంబై కేంద్ర కార్యాలయానికి పంపించి సంబంధిత దృశ్యాన్ని తొలగించాలని సెన్సార్ అధికారులను కోరారు. తమ డిమాండ్ ను పట్టించుకోకపోతే ఆగస్ట్ 15న సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసనకు దిగుతామని హెచ్చరించారు.