Telangana: టీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతున్న నన్ను అంతం చేసేందుకు యత్నిస్తున్నారు: నాగం జనార్దన్ రెడ్డి
- అవినీతిని బయటపెడితే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు
- నాకు ప్రాణభయం ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేశా
- పాలమూరుపై కేసీఆర్ పక్షపాత వైఖరి కనబరుస్తున్నారు
కాంగ్రెస్ నేత నాగం జనార్దనరెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవినీతిపై తాను హైకోర్టులో పిల్ వేశానని, ఈ పథకంలో రూ.5700 కోట్ల అవినీతిని బయటపెడితే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని, తనకు ప్రాణభయం ఉందని, అందుకే, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
టీఆర్ఎస్ అవినీతిపై తాను పోరాడుతుంటే, తనను అంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాపై కేసీఆర్ పక్షపాత వైఖరి కనబరుస్తున్నారని మండిపడ్డారు. పాలమూరులో భూమి కోల్పోయిన వారికి నాలుగైదు లక్షల పరిహారమే ఇస్తున్నారని, కానీ, మెదక్, కరీంనగర్ లో అయితే రూ.12 లక్షల పరిహారం ఎకరాకు ఇస్తున్నారని చెప్పారు. రైతుల మేలు కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని చెప్పారు.