Jagan: జగన్-పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే!: మాజీ ఎంపీ సబ్బం హరి
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది
- ఈ రెండు పార్టీలను వెనుకుండి బీజేపీ నడిపిస్తోంది
- వైసీపీ-జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుంది
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలను వెనుకుండి బీజేపీ నడిపిస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలు నడిపిందో, ఈరోజున ఏపీలో బీజేపీ అలాంటి రాజకీయ క్రీడ నడపబోతోందనే విషయం రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
జగన్, పవన్ లకు ఎవరి సమీకరణాలు వారికున్నప్పటికీ, వాళ్లిద్దరిని బీజేపీ డైరెక్టు చేస్తోందనే విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతిఒక్కరికీ అర్థమవుతుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ-బీజేపీ కలిసి పోటీ చేయవని, అదే, వైసీపీ-జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబునాయుడిని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని, కొంతమేరకు ఆ అభిప్రాయం నిజమని అన్నారు.
‘జగన్-పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబునాయుడి గెలుపు నల్లేరు మీద నడకే. కచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది. కానీ, వైసీపీ-జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది’ అని చెప్పుకొచ్చారు.