BJP: నో డౌట్.. టీఆర్ఎస్ మాకు శత్రువే!: రాంమాధవ్
- హన్మకొండ సభలో నిప్పులు చెరిగిన రాంమాధవ్
- కేసీఆర్ మజ్లిస్‌కు మోకరిల్లుతున్నారు
- తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
టీఆర్ఎస్ తమకు ఎప్పటికీ మిత్రపక్షం కాలేదని, ఆ పార్టీ తమకు శత్రువేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర గురువారం వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాంమాధవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఢిల్లీలో పీఎం మోదీని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి ఫొటోలు దిగుతారని, హైదరాబాద్ రాగానే మజ్లిస్ ముందు మోకరిల్లుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసోంలో గతంలో రెండు సీట్లతోనే ప్రారంభించిన తాము ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇక్కడ ఏర్పాటు చేయలేమా? అని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రతి పనిలోనూ అవినీతిని పెంచి పోషిస్తున్నారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. ఇలా ఏది తీసుకున్నా కమీషన్లు, పర్సెంటేజీలు కనిపిస్తాయని ఆరోపించారు. మొత్తం పనుల్లో 25 శాతం పర్సెంటేజీలను ముందుగా, బాహాటంగానే నిర్ణయిస్తున్నారని, అందులో మూడుశాతం సిరిసిల్ల మంత్రికి ఇవ్వాల్సిందేనంటూ పరోక్షంగా కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. కాగా, తెలంగాణలో పలు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్రమంత్రి సురేశ్ ప్రభు తదితరులు మాట్లాడారు. జనచైతన్య యాత్ర తొలి దశ నేడు ముగియనుంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.