Mumbai: ముంబైలో విమానం కూలిపోవడానికి ముందు పైలట్ చివరి మాటలు వెల్లడి!
- విమానాన్ని ల్యాండ్ చేయాలన్న ఏటీసీ
- వాతావరణం అనుకూలించడం లేదన్న పైలట్
- ఆ తర్వాత సంబంధాలు కట్
గతవారం ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో సి-90 చార్టెడ్ విమానం ఒకటి నిర్మాణంలో ఉన్న భవంతిపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఇంజినీర్లు, ఓ నిర్మాణ కార్మికుడు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
వాతావరణం అనుకూలంగా లేదని, చాలా ప్రమాదకరంగా ఉందని జుహు ఏటీసీకి పైలట్ సమాచారం అందించారు. విమానం నిర్దేశిత ఎత్తు కన్నా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని చెప్పారు. విమానం ఎగిరిన 44 నిమిషాల తర్వాత వాషీ క్రీక్‌ను దాటిన తర్వాత పైలట్ ఏటీసీతో మాట్లాడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 118.1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఫ్లైట్ కెప్టెన్ పీఎస్ రాజ్పుట్, ఏటీసీ మధ్య ఈ సంభాషణ జరిగింది.
‘‘మీరిప్పుడు ముంబై ఎయిర్‌పోర్టు పాత్‌కు దగ్గరవుతున్నారు. కుడివైపు మరలి ల్యాండింగ్ అవండి’’ అని ఏటీసీ నుంచి రాజ్‌పుట్‌కు సందేశం అందింది. దీనికి కెప్టెన్ సమాధానమిస్తూ.. వాతావరణం దీనికి అనుకూలించేలా లేదని చెప్పారు. పైలట్-ఏటీసీ మధ్య జరిగిన చివరి సంభాషణ ఇదే. ఆ తర్వాత ఏటీసీ పైలట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వెంటనే విమానం కుప్పకూలింది.