Gujarat: గుజరాత్ లో చిన్నపిల్లల కిడ్నాపర్‌ను చితకబాదిన జనం.. మంచి పని చేశారన్న పోలీసులు!
- గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘటన
- ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అపహరణకు యత్నం
- తనకు ఏ గ్యాంగుతోనూ సంబంధాలు లేవన్న నిందితుడు
చిన్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నాడంటూ జనాలు ఓ వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టారు. విషయం తెలిసి అక్కడికొచ్చిన పోలీసులు మంచి పనిచేశారంటూ జనాన్ని ప్రశంసించడం వివాదాస్పదమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిందీ ఘటన. నిందితుడిపై కిడ్నాప్ కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై దాడి చేస్తుండగా వచ్చిన పోలీసులు అడ్డుకోకపోగా మంచి పనిచేశారంటూ కితాబునిచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన చిలియ రథవ (30) ఓ కార్మికుడు. ఇంటికి సమీపంలో ఆలయం బయట ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. బాలికను రథవ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆలయ పూజారి చూసి కేకలు వేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రథవాను పట్టుకుని చితకబాదారు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేదు.
బాలికను తాను కిడ్నాప్ చేయాలనుకున్నది నిజమేనని, అయితే, తనకు ఏ గ్యాంగుతోనూ సంబంధాలు లేవని నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసేందుకే కిడ్నాప్ చేయాలనుకున్నాడని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు వివరించారు.