K Kavitha: నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి
- కేసీఆర్ ఎన్నికల సర్వేలు బూటకం
- తెలంగాణ రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోంది
- చైతన్య, నారాయణ కళాశాలల్లో కేసీఆర్ కుటుంబసభ్యులకు వాటా
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెబుతున్న మంత్రి కేటీఆర్, తన చెల్లెలు, నిజామాబాద్ ఎంపీ కవితను గెలిపించుకుంటే చాలని, అదే కనుక జరిగితే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ కు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.
నిజామాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఎన్నికల సర్వేలు బూటకమని, తెలంగాణ రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంసెట్ లీకేజీ స్కామ్ వ్యవహారం గురించి ఆయన ప్రస్తావించారు. శ్రీచైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి, ఆ కళాశాల పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీచైతన్య, నారాయణ కళాశాలల్లో నలభై శాతం వాటా కేసీఆర్ కుటుంబసభ్యులదేనని ఆయన ఆరోపించారు.
కాగా, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తిరుగుతున్నారంటే సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశానికి డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లా అంటే కేసీఆర్ కు భయమని, నకిరేకల్ నియోజకవర్గం అంటే ఆయనకు మరింత భయమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.