Narendra Modi: మోదీ, రాహుల్ కి ‘అగ్రికల్చర్’ ఛాలెంజ్.. పొలం దున్నాలంటూ ఓ సర్పంచ్ సవాల్
- కనీసం, ఒక్క రోజు అయినా పొలంలో రైతులా పనిచేయాలి
- అప్పుడే, కర్షకులు పడే బాధలేంటో తెలుస్తాయి
- దక్షిణ గోవాలోని అకెమ్ బయిసో గ్రామ సర్పంచ్ సిద్ధేశ్ భగత్
రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలు ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’ లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ‘హగ్ ఏ ట్రీ’ పేరిట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవలే సరికొత్త ఛాలెంజ్ కు దిగారు. తాజాగా, గోవాలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ కొత్త ఛాలెంజ్ విసిరారు.
కనీసం, ఒక్క రోజు అయినా పొలంలో రైతులా పని చేయాలని దక్షిణ గోవాలోని అకెమ్ బయిసో గ్రామ పంచాయతి సర్పంచ్ సిద్ధేశ్ భగత్ ‘ఛాలెంజ్’ విసిరారు. వ్యవసాయ క్షేత్రంలో నాగలి దున్నాలని, ట్రాక్టర్ నడపాలని, విత్తనాలు చల్లాలని.. రైతులా పని చేయాలని, అప్పుడే, కర్షకులు పడే బాధలేంటో వారికి తెలుస్తాయని, అందుకే, ఈ ఛాలెంజ్ చేశానని చెప్పారు.
నలుగురికీ తన గురించి తెలియడం కోసం ఈ ఛాలెంజ్ విసరలేదని, రైతు కష్టాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సవాల్ చేశానని చెప్పారు. మోదీ, రాహుల్ తో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, విరాట్ కోహ్లీ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరారు.
కాగా, గోవాలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ఛాలెంజ్ ను ఇప్పటికే స్వీకరించి పొలాల్లోకి దిగారు. ఈ ఛాలెంజ్ మొట్టమొదట స్వీకరించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో. గోవా రెవెన్యూ శాఖ మంత్రి రోహన్ కౌంటే కూడా తన నియోజకవర్గంలోని ఓ పొలంలోకి వెళ్లి వ్యవసాయ పనులు చేశారు.