Yanamala: ఇలాంటి ఆలోచనలన్నీ జాతీయపార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకే!: మంత్రి యనమల
- ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికలు
- చిన్న చేపలను తిని జీవించే పెద్ద చేప బీజేపీ
- రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడమే బీజేపీ అజెండా
జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, జమిలి ఎన్నికలు వంటి ఆలోచనలన్నీ జాతీయ పార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకేనని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, ఏ జాతీయ పార్టీ కూడా సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదని అభిప్రాయపడ్డారు.
చిన్న చేపలను తిని జీవించే పెద్ద చేపగా బీజేపీ ధోరణి ఉందని, మోదీ తరహాలో గతంలో ఎవరూ ఇలాంటి రాజకీయాలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరచడమే అజెండాగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రమాదకరంగా మారాయని, ఆర్థిక సంఘానికి ఈ మార్గదర్శకాలను సూచించింది బీజేపీ నేతలేనని విమర్శించారు.