Andhra Pradesh: కీలక నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
- ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై న్యాయపోరాటం
- విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టుకు..
- సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం
- గృహ నిర్మాణశాఖకు అదనపు బడ్జెట్ కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు నిర్ణయించామని అన్నారు.
సమాచార రంగంలో ఏళ్ల తరబడి సేవలందిస్తోన్న పాత్రికేయులకు గృహ వసతి కల్పనకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. తాము ఇప్పటికే ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, గృహ నిర్మాణశాఖకు రూ.1,480కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. అలాగే, ఆక్రమణకు గురయి అభ్యంతరాల్లేని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ప్రపంచస్థాయి క్రీడానగరం కోసం భూసమీకరణకు మంత్రిమండలి అనుమతినిచ్చిందని అన్నారు.