Twitter: అక్రమంగా తరలిస్తోన్న 26 మంది బాలికలను రక్షించిన ప్రయాణికుడి ట్వీట్!
- మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
- 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలు
- చాకచక్యంగా రక్షించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ దళాలు
మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా 26 మంది బాలికలను తరలించడానికి కొందరు దుండగులు ప్రయత్నించారు. ఓ భోగీలో 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలు భయపడుతూ ఉండడం చూసిన ఓ వ్యక్తి.. పోలీసులకు ట్వీట్ చేయడంతో ఆ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి బయటపడ్డారు.
ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై వెంటనే స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు ఎంతో చాకచక్యంగా సమన్వయంతో వ్యవహరించాయి. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు ఆ బాలికలు ఉన్న బోగీలోకి వెళ్లి, గోరఖ్‌పూర్ వరకు అందులోనే ప్రయాణించగా, ఆ స్టేషన్లో మాటువేసిన మిగతా పోలీసులు వెంటనే బోగీలోకి ప్రవేశించి బాలికలను రక్షించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి నుంచి ట్వీట్ అందిన అర్ధగంటలోనే బాలికలను పోలీసులు రక్షించారు.