Pawan Kalyan: మీకు కనిపించడం లేదు.. మీ కొడుకు లోకేశ్‌ను పంపండి చూపిస్తా: చంద్రబాబుకు పవన్ సూచన
- మహారాష్ట్ర రైతుల్లా ఉద్యమం
- ఉండవల్లి నుంచే మొదలు
- అంతమంది ఎంపీలున్నా రైల్వే జోన్ తేలేకపోతున్నారు
టీడీపీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోమారు ఫైరయ్యారు. విశాఖపట్టణంలో నిర్వహించిన భూ నిర్వాసితుల జనసభలో ఆయన నిప్పులు చెరిగారు. నేటి పాలకులు హిరణ్యకశిపుల్లా తయారయ్యారని ఆరోపించారు. ఇక్కడి రైతులు కూడా మహారాష్ట్ర రైతుల్లా హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఆ పోరాటాన్ని ఉండవల్లి నుంచే మొదలు పెడతామని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేద్దామని అన్నారు.
ఉత్తరాంధ్ర సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం ఆయన కుమారుడు లోకేశ్‌ను పంపితే అయినా చూపిస్తానని పవన్ సూచించారు. తగరపువలసలో పవన్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి గెలవడానికి తానే కారణమన్నారు. కానీ వాళ్లు ఈ ప్రాంతానికి చేసింది శూన్యమని ఆరోపించారు. ఫిరాయింపు ఎంపీలతో కలిసి మొత్తం 18 మంది ఉన్నా రైల్వే జోన్ కూడా సాధించలేకపోతున్నారని అన్నారు.