jayalalitha: జయలలిత కేసులో రోజుకో మలుపు.. కీలక విషయాలు వెల్లడించిన అపోలో ఈసీజీ ఆపరేటర్
- గుండె పోటు రావడానికి ముందు వరకు టీవీ చూస్తున్నారన్న శశికళ
- ఈసీజీ టెస్టు చేసినట్టు చెప్పిన అపోలో ఆపరేటర్
- నాలుగు గంటలకే హార్ట్ ఎటాక్ వచ్చిందని ఫోన్ వచ్చిందన్న జయశ్రీ
- జయ మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. జయ మృతి కేసును విచారిస్తున్న జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఎదుట ఆరు నెలల క్రితం జయ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం బయటకొచ్చి సంచలనం సృష్టించింది.
తాజాగా అపోలో ఆసుపత్రిలో ఈసీజీ ఆపరేటర్ నళిని ఇచ్చిన వాంగ్మూలం మరోమారు ‘అమ్మ’ మృతిపై అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. డిసెంబరు 4, 2016న సాయంత్రం జయలలితకు ఈజీసీ టెస్ట్ చేసినట్టు నళిని కమిషన్కు తెలిపారు. ఆ రోజు తన సమక్షంలోనే మధ్యాహ్నం 3:50 గంటలకు ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. డయాబెటాలజిస్ట్ జయశ్రీ గోపాల్ మాట్లాడుతూ జయకు గుండెపోటు వచ్చినట్టు డిసెంబరు 4న సాయంత్రం నాలుగు గంటలకు తనకు ఫోన్ వచ్చినట్టు తెలిపారు.
అయితే, వీరి వాంగ్మూలానికి జయ నెచ్చలి శశికళ చెబుతున్నదానికీ పొంతన లేకపోవడం గమనార్హం. మరోవైపు అధికారిక రికార్డుల్లోనూ పొంతన లేకుండా ఉంది. సెప్టెంబరు 22, 2016న జయ అపోలో ఆసుపత్రిలో చేరారు. డిసెంబరు 4న సాయంత్రం 4:20 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాతి రోజు ఆమె మృతి చెందారు. గుండెపోటు రావడానికి ముందు వరకు ఆమె టీవీ చూస్తున్నారని శశికళ చెప్పారు. ఈసీజీ ఆపరేటర్ నళిని, డయాబెటాలజిస్ట్ జయశ్రీ చెప్పినది ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో జయలలిత మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.