Congress: పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా వామపక్షాలతో కాంగ్రెస్ కటీఫ్!
- వామపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శ
- పశ్చిమ బెంగాల్లో కటీఫ్
- ఏపీలో జనసేనతో కలిసి వెళ్లడంపై గుర్రు
ఇన్నాళ్లూ తమతో నడిచిన లెఫ్ట్ పార్టీలతో ఇకపై వెళ్లేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాకూటమి’ ఏర్పాటులో బిజీగా ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐతో పొత్తు విషయంలో వెనకాముందు ఆడుతోంది. శుక్రవారం పశ్చిమబెంగాల్ నేతలతో సమావేశమైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పొత్తు విషయంలో సుదీర్ఘంగా చర్చించినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో నిర్ణయాన్ని 21కి వాయిదా వేశారు.
కాంగ్రెస్‌కు చెందిన సగం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే తృణమూల్ వైపు చూస్తున్న నేపథ్యంలో రాహుల్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 44 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పటికీ తృణమూల్‌ను ఓడించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో వామపక్షాలకు రాంరాం చెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి కూడా వామపక్షాలతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్లో బలహీనంగా ఉన్న వామపక్షాలతో పొత్తు అంటే ఆత్మహత్యా సదృశమే అవుతుందని అంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదనేది కాంగ్రెస్ వాదన. మరోవైపు ఏపీలో పవన్ కల్యాణ్ జనసేనతో వామపక్షాలు కలిసి వెళ్లడాన్ని కూడా కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఆ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏపీలో పవన్‌తో కలిసి వెళ్తున్న పార్టీలు తెలంగాణలో మాత్రం వేర్వేరుగా వెళ్తుండడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో ఆ పార్టీలతో భవిష్యత్తులో కలిసి వెళ్లకపోవడమే మంచిదని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క బెంగాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ పార్టీలతో కటీఫ్ చెప్పడమే మంచిదని అంటున్నారు.