kerala: బొట్టు పెట్టుకుందని.. మదర్సా నుంచి విద్యార్థినిని బహిష్కరించారు
- షార్ట్ ఫిలిం కోసం బొట్టు పెట్టుకున్న విద్యార్థిని
- ఆగ్రహం వ్యక్తం చేసిన మదర్సా యాజమాన్యం
- ముస్లింవి అయివుండి ఇలాంటి పని ఎలా చేశావంటూ ఆగ్రహం
ముస్లిం సంప్రదాయాలను మంటగలిపిందనే కారణంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మదర్సా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో జరిగింది. ఉమర్ మలయిల్ అనే వ్యక్తి కూతురు మదర్సాలో చదువుతోంది. ఓ షార్ట్ ఫిలింలో నటించేందుకు సిద్ధమైన ఆమె నుదుటన గంధపు బొట్టును పెట్టుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం ఆమెను బహిష్కరించింది. ముస్లింవి అయివుండి ఇలాంటి పని ఎలా చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
జరిగిన విషయం తెలుసుకున్న ఆమె తండ్రి మదర్సా తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. చదువుతోపాటు ఆటపాటల్లో కూడా తన కూతురు ఎన్నో బహుమతులు పొందిందని... ఎంతో ప్రతిభ ఉన్న తన కుమార్తెను మదర్సా నుంచి బహిష్కరించడం దారుణమని అన్నారు. బొట్టు పెట్టుకోవడమే ఆమె చేసిన పొరపాటా? అని అడిగారు. మదర్సా తీసుకున్న నిర్ణయానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఆయన చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు మదర్సా నిర్ణయాన్ని తప్పు బట్టగా... మరికొందరు షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు మంచి శాస్తి జరిగిందంటూ కామెట్ చేస్తున్నారు.